

భారత మావోయిస్టులు, వారి ఉద్యమంపై విస్తృతంగా పరిశోధన చేసిన భద్రతా నిపుణుడు పీవీ రమణ రచించిన ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ పుస్తకాన్ని బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి. శివధర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, పోలీసు బలగాల సమష్టి కృషితో నక్సలిజం ప్రభావం తగ్గిందని శివధర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయాన్ని చాటిచెప్పే అంబేడ్కరిజం భావజాలం ప్రజల్లో చైతన్యాన్ని పెంచి, మావోయిస్టుల ప్రచారాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. నక్సలైట్లతో చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఈ భావజాలం ప్రభావం చూపిందని వివరించారు. విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల యువతతో పాటు వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు తొలుత నక్సలిజాన్ని స్థానిక సమస్యగా పరిగణించినప్పటికీ, తర్వాత దీర్ఘకాలిక సవాలుగా గుర్తించి గ్రేహౌండ్స్, ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబీ) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లతో చర్చలకు ప్రయత్నాలు ప్రారంభించారని, ఆ తర్వాతి పరిణామాల్లో ఇరువైపులా నష్టాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు అనేక ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారని మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసు బలగాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. శాశ్వత శాంతి సాధించాలంటే నిరంతర నిఘాతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించే ప్రక్రియను ఆచితూచి చేపట్టాలని, వ్యూహాత్మకంగా కీలకమైన అటవీ ప్రాంతాల్లో అవసరమైన స్థావరాలను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. నగరాల్లోని మావోయిస్టుల రహస్య నెట్‌వర్క్‌లు, అక్రమ నిధుల మార్గాలను కూడా మరింతగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం దేశంలోని 196 జిల్లాల్లో నక్సలిజం సమస్య ఉండేదని, రెడ్ కారిడార్ విస్తరణకు ఆ పరిస్థితులు అవకాశం కల్పించాయని పుస్తక రచయిత పీవీ రమణ వివరించారు. మావోయిస్టు పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాలు, పట్టణ నెట్‌వర్క్‌లు, మహిళా క్యాడర్, ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు వంటి అంశాలను పుస్తకంలో విశ్లేషించినట్లు తెలిపారు. అడవులు, నగరాల్లో నగదు, బంగారు బిస్కట్ల నిల్వలు ఉన్నాయన్న వివరాలతో పాటు ప్రధాన సాయుధ దాడులు, లొంగుబాటు విధానాల్లోని లోపాలను కూడా పరిశీలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శాంతిభద్రతల విభాగం డీజీ మహేశ్ మురళీధర్ భగవత్, గ్రేహౌండ్స్ డీజీ అనిల్‌కుమార్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, పలువురు మాజీ పోలీసు అధికారులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!