

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర జలహక్కుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో జరిగిన సమావేశంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన ఒప్పందాలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని తాకట్టు పెడుతోందని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల సామర్థ్యంతో నవేలి రిజర్వాయర్‌ను, 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలను నిర్మిస్తోందని హరీశ్ రావు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల కారణంగా మొత్తం 55 టీఎంసీల నీటి నిల్వ జరుగుతుందని, దీని ప్రభావం తెలంగాణకు తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తుంగభద్ర నదిలో నీటి నిల్వల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాలపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల వాటాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ హయాంలో గోదావరి జలాల్లో 383 టీఎంసీలకు అనుమతులు సాధించామని, మొత్తం 830 టీఎంసీల ప్రాజెక్టులకు ఆమోదాలు తీసుకువచ్చామని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో ఒక్క టీఎంసీకి కూడా కొత్త అనుమతులు సాధించలేదని విమర్శించారు. రాష్ట్ర జలహక్కుల అంశంపై శాసనసభలో చర్చ జరిపి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!