

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ అవినీతి, బంధుప్రీతి, పరిపాలనా వైఫల్యాలకు నిలయంగా మారిందని భారాస అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారాస ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోందని తెలిపారు. దసరా సమీపిస్తున్నా లాభాల వాటా ప్రకటించకపోవడంపై ప్రశ్నించారు. భారాస ప్రభుత్వ హయాంలో కార్మికులకు 32 శాతం లాభాల వాటా ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది తగ్గిందని పేర్కొన్నారు.
సింగరేణికి రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం, గనుల ప్రారంభంలో జాప్యం, డిపెండెంట్ ఉద్యోగాలపై ఆంక్షలు వంటి అంశాలను హరీశ్‌రావు ప్రస్తావించారు. బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల్లో పూర్తి వాటా చెల్లించాలని, అర్హులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, సంస్థ ఎన్నికలు నిర్వహించాలని, బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్లతో అక్టోబర్ 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!