

అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌ను కొన్నాళ్ల క్రితం పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే తన పదవిని కాపాడుకునేందుకు ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.232 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ విరాళం అనంతరం లుట్నిక్‌ను తొలగించాలన్న ఆలోచనను ట్రంప్ పక్కనపెట్టినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరాల కేసులో కీలక నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కలిసి ఓ ప్రైవేటు ద్వీపంలో భోజనం చేసినట్లు లుట్నిక్ స్వయంగా వెల్లడించడంతో అమెరికా కాంగ్రెస్‌లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఎన్విడియా వ్యవహారంలోనూ ఆయన పనితీరు వివాదాస్పదమైంది. అత్యాధునిక చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై ఆంక్షలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో లుట్నిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించే అంశంపై శ్వేతసౌధంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బిలియనీర్ అయిన లుట్నిక్‌కు ట్రంప్‌తో రెండు దశాబ్దాలకు పైగా స్నేహం ఉంది. ఈ సుదీర్ఘ అనుబంధమే ఆయనకు పదవిలో కొనసాగేందుకు తోడ్పడుతోందని మీడియా కథనాలు విశ్లేషిస్తున్నాయి. ఉన్నతాధికారులతో విభేదాలు, తనపై వచ్చిన ఆరోపణల మధ్య కూడా లుట్నిక్ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి ఆయన భారీ విరాళం ఇచ్చినట్లు వచ్చిన వార్తలు మరింత చర్చకు దారితీశాయి. ఈ విరాళం కారణంగానే ట్రంప్ ఆయనను పదవిలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే విరాళం, పదవిలో కొనసాగింపు మధ్య సంబంధం ఉందన్న విషయం ప్రస్తుతం మీడియా కథనాల ఆధారంగానే ప్రచారంలో ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!