

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పటికే 3,269 భవనాల పనులు సుమారు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అలాగే 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను రూ.800 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రాంతీయ సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. గ్రామీణ రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేలా రహదారుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రహదారి పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి తాగునీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి నీటి లభ్యతను అంచనా వేయాలని, ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వ్యవసాయ పనులు తగ్గే పరిస్థితుల్లో అర్హులైన కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పిస్తూ నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడవద్దని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, రహదారులు, తాగునీరు, ఉపాధి హామీ, నీటి సంరక్షణ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!