

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని అభయారణ్యం పర్యాటకాభివృద్ధిలో మరో కీలక అడుగు వేసింది. కిన్నెరసానిని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సఫారీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర స్థాయి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సేవలు కిన్నెరసాని పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందించనున్నాయని అధికారులు తెలిపారు.
ప్రకృతి అందాలు, దట్టమైన అటవీ సంపద, అరుదైన వన్యప్రాణులు, విభిన్న జాతుల పక్షులతో ప్రసిద్ధి చెందిన కిన్నెరసాని అభయారణ్యం ఇప్పటికే ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలిచింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సఫారీ వాహనాల ద్వారా సందర్శకులు అడవి అందాలను మరింత చేరువగా, సురక్షితంగా ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. దీంతో కిన్నెరసాని పర్యాటక ప్రాధాన్యం మరింత పెరగనుంది.
కిన్నెరసానిని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధి, సీతాకోకచిలుకల ఉద్యానవనం ఏర్పాటు, సిమెంట్ రహదారుల నిర్మాణం, మేత నిల్వ కేంద్రాల నిర్మాణం, సందర్శకుల సౌకర్యాల కల్పన వంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. సఫారీ సేవల ప్రారంభంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న వ్యాపారులు, హోటళ్లు, రవాణా రంగానికి కూడా ప్రయోజనం కలగనుంది. కిన్నెరసానిని రాష్ట్రంలోని ప్రముఖ పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!