

విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ఎస్‌ఎస్‌ఎస్ హుబ్బళ్ళి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి స్టేషన్ దాటిన సుమారు 15 నిమిషాల తర్వాత, రాత్రి ఒంటిగంట దాటిన సమయంలో ఏ1 ఏసీ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో బోగీలో దుప్పట్లు అందజేస్తున్న కే. కిరణ్ అప్రమత్తమై పొగలను గుర్తించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ప్రయాణికులను వెంటనే మేల్కొలిపి అప్రమత్తం చేయడంతో రైల్వే సిబ్బంది స్పందించి బోగీని పరిశీలించారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే సిబ్బంది ప్రాథమికంగా బోగీలోని విద్యుత్ వైర్లను ఎలుక కొరకడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పొగలు వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను రైలు నుంచి బయటకు దించారు. అయితే రైలు ఆగిన ప్రాంతంలో చీకటి ఉండటం, పట్టాల పక్కన రైల్వే నిర్మాణ సామగ్రి ఉండటంతో బయటకు వచ్చే సమయంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు ప్రయాణికులు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో కొందరు సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇతర విలువైన వస్తువులను కోల్పోయినట్లు చెప్పారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలును తిరిగి నడిపేందుకు సిబ్బంది చర్యలు చేపట్టగా, భయాందోళనలో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు కొంత సమయం తీసుకున్నారు. కిరణ్ అప్రమత్తత, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలతో ప్రమాదం పెద్దదిగా మారకుండా నివారించగలిగినట్లు ప్రయాణికులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!