

బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో గొర్రెలు, మేకల సంతలు రద్దీగా మారుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వ్యాపారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ మోసగాళ్లు ఫేక్ ఫోన్‌పే వంటి నకిలీ డిజిటల్ పేమెంట్ యాప్‌లను ఉపయోగించి గొర్రెలు, మేకల వ్యాపారులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సంతల్లో ఉండే హడావుడిని ఆసరాగా చేసుకుని, నగదు చెల్లించినట్లు నకిలీ స్క్రీన్ చూపించి జీవాలను తీసుకెళ్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
కంచన్‌బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి రెండు మోసాలు నమోదయ్యాయి. బాధితులు తర్వాత బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేయగా డబ్బు జమ కాలేదని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేవలం కొనుగోలుదారుల ఫోన్‌లో కనిపించే స్క్రీన్‌షాట్‌లు, పేమెంట్ సక్సెస్ మెసేజ్‌లను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. అధికారిక బ్యాంక్ ఎస్‌ఎంఎస్ లేదా బ్యాంకింగ్ యాప్‌లో డబ్బు జమ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే జీవాలను అప్పగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!