

బెంగళూరులో ‘ది ఎర్త్ సెంటర్ – విష్టా స్పేసెస్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. సాధారణ కార్యాలయ భవనాలకు భిన్నంగా ప్రకృతి, సాంకేతికత, పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ఈ భవనాన్ని నిర్మించారు. పునర్వినియోగ పదార్థాలు, టెర్రకోటా వంటి పర్యావరణహిత పదార్థాల వినియోగంతో పాటు నీటి సంరక్షణ, శక్తి సామర్థ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణహిత నిర్మాణాల వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. వనరులను అధికంగా వినియోగించే భవనాల కంటే వాటిని తెలివిగా వినియోగించే నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాతావరణ మార్పు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే మన ముందున్న సవాలని పేర్కొన్నారు. భవన నిర్మాణాల్లో నెట్ జీరో విధానాన్ని అవలంబించాలని, సౌర విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నీటి సంరక్షణ, వ్యర్థాలను కంపోస్టుగా మార్చడం, పునర్వినియోగ విధానాలను పాటించాలని అన్నారు.
అభివృద్ధి ఆగకూడదని, అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీయకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. దశాబ్దాలుగా నగరాల విస్తరణ గ్రే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా జరిగిందని, ఇప్పుడు గ్రీన్ గ్రోత్, సర్క్యులర్ గ్రోత్, రీజెనరేటివ్ గ్రోత్ వంటి విధానాల వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రతి పైకప్పును విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవచ్చని, ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించుకోవచ్చని, ప్రతి వ్యర్థ ప్రవాహాన్ని వనరుగా మార్చుకోవచ్చని చెప్పారు. నీటిని, నేలను కాపాడటం అంటే సంపదను సృష్టించడమేనని అన్నారు.
2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉంటోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 165 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. అమరావతిని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ను అభివృద్ధి చేశానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మరో చక్కటి నగరాన్ని నిర్మించే అవకాశం తనకు లభించిందని చంద్రబాబు అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!