

మురసు తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఈ బృందం రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 60 ప్రాంతాలను సందర్శించింది. దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించింది. భీమడోలు మండలం సూరప్పగూడెంలో రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టాన్ని అంచనా వేసింది. రావులపర్రులో డ్రెయినేజీ వ్యవస్థ, వరి పొలాలను, కునకలమర్రులో కొమ్ము కాలువ, రహదారులు, సాగునీటి సదుపాయాలను పరిశీలించింది. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టాన్ని, బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో పాటు ఒకేసారి రెండు తుఫాన్లు రావడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందన్నారు. ముందస్తు అంచనాలతో సహాయక చర్యలు చేపట్టామని, తుఫాన్ అనంతరం 24 గంటల్లోనే రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సేవలను పునరుద్ధరించామని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా పంపిణీ చేశామని వివరించారు. భవిష్యత్తులో తుఫాన్ల వల్ల నష్టం తగ్గించేందుకు మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠంగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన నివేదిక ప్రకారం, మురసు తుఫాన్ వల్ల దాదాపు రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లింది. 1,385 కిలోమీటర్ల మేర రహదారులు, 36 చోట్ల గండ్లు, 65 కల్వర్టులు దెబ్బతినడంతో రూ.888.84 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.874.97 కోట్ల నష్టం వాటిల్లగా, 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. 6,756 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ.337.10 కోట్ల నష్టం జరగ్గా, 12,605 మంది రైతులు నష్టపోయారు. 369 సాగునీటి వనరులు దెబ్బతినడంతో పాటు 509 చోట్ల గండ్లు పడ్డాయి. విద్యుత్ రంగంలో 10,192 11 కేవీ స్తంభాలు, 6,442 ఎల్‌టీ స్తంభాలు, 1,448 డీటీఆర్‌లు దెబ్బతిన్నాయి. మొత్తం 3,859 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 645 గుడిసెలు ఉన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం రూ.37 కోట్ల వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. గ్రామీణ రహదారులు, విద్యుత్ వ్యవస్థ, కచ్చా ఇళ్లకు భారీ నష్టం జరిగినట్లు కేంద్ర బృందం గుర్తించింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆదిమ గిరిజనులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, దెబ్బతిన్న ఇళ్లలో నివసించే కుటుంబాలకు ప్రత్యేక సహాయం అందించాలని సూచించింది. తుఫాన్ నష్టంపై 10 రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించి, బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర బృందాన్ని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!