

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాలని భారాస మాజీ మంత్రి బి.వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే సీఈసీపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తప్పించాలని కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అని, ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనే విషయాలను నిర్ణయించే సంస్థ కాదని అన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో భాజపా ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించిందని అర్థమవుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రధాని మోదీ తీరుతో ఎన్నికల సంఘం దౌర్భాగ్య పరిస్థితికి చేరుకుందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి రాష్ట్రపతికి నివేదించాలని కోరారు. ఇది చిన్నపాటి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ కు సంబంధించిన ఉత్తర్వులు, షెడ్యూల్‌ను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారని స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!