

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు రష్యాలో అరుదైన ఘనత సాధించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఉదయం పర్వత శిఖరానికి చేరుకున్న అనంతరం 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపించారు.
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనే సంకల్పంతో వెంకటేశ్వరరావు ఈ సాహసయాత్ర చేపట్టారు. పర్వతారోహణలో తన పట్టుదల, శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించడంతోపాటు దేశభక్తిని చాటుకున్నారు. రష్యాలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశ గౌరవాన్ని చాటారు.
తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి వెంకటేశ్వరరావు అంకితం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ దేశం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన సిబ్బంది సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన సాధించిన ఈ ఘనత ఏపీ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలవడంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!