

విశాఖ అర్బన్ ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్ల పరిమాణంపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక్కో గుడ్డు సుమారు 50 గ్రాములు ఉండాలి. 30 గుడ్లు ఉన్న ట్రే బరువు మినహాయిస్తే సుమారు 1.5 కిలోలు ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన పరిశీలనలో 1.1 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఒక్కో ట్రేలో దాదాపు 400 గ్రాముల బరువు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్ల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుడ్లు నెలకు నాలుగుసార్లు సరఫరా చేయడంతో పాటు వాటి వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. గుడ్డు రంగు మారినా, దెబ్బతిన్నా దాని స్థానంలో కొత్తది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, గుడ్లు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే తమకు నిర్లక్ష్య సమాధానాలు ఎదురవుతున్నాయని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. గుడ్లను వాహనం నుంచి దించి తూకం వేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. విశాఖ అర్బన్ ఐసీడీఎస్ పరిధిలో 275 అంగన్‌వాడీ కేంద్రాలు, 6,345 మంది చిన్నారులు ఉన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఐసీడీఎస్ పీవో నీలిమ తెలిపారు. ఇటీవల రంగు మారిన గుడ్లపై ఫిర్యాదు రావడంతో వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!