

బుల్లెట్ రైళ్ల రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రవాణా రంగం మరో కీలక ముందడుగు వేయనుంది. హైదరాబాద్–అమరావతి–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో అమరావతి స్టేషన్‌ను విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అంగీకారం తెలిపింది. విజయవాడ ప్రజలు బుల్లెట్ రైలు ఎక్కేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 760 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 518 కిలోమీటర్ల మార్గం ఉండనుంది. దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా ఈ మార్గం చెన్నైకి చేరుకోనుంది. అయితే తెలంగాణ పరిధిలో కారిడార్ వెళ్లే మార్గంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో తుది అలైన్‌మెంట్ ఖరారు కావాల్సి ఉంది.
తెలంగాణలో శంషాబాద్, భారత్‌సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా కారిడార్‌ను ఏపీలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ఈ మార్గం హైదరాబాద్‌కు దూరమవుతుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో NHSRCL అధికారులు ఫైనల్ లొకేషన్ సర్వే (FLS), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ అంశాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడే తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ విషయంలోనూ ఇదే తరహా సందిగ్ధత నెలకొంది. గతంలో తమిళనాడు ప్రభుత్వం పెరందూరులో విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించడంతో ఆ మార్గానికి అనుగుణంగా హైస్పీడ్ రైలు అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే కొత్త ప్రభుత్వం విమానాశ్రయ ప్రతిపాదనను మరో ప్రాంతానికి మార్చడంతో రైలు మార్గంపై స్పష్టత కరవైంది. ఈ పరిణామాల ప్రభావంతో తిరుపతి–చిత్తూరు మధ్య లింక్ కారిడార్ నిర్మించాలన్న ఏపీ ప్రతిపాదన కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ లింక్ ద్వారా హైదరాబాద్–అమరావతి–చెన్నై, చెన్నై–బెంగళూరు కారిడార్లను అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!