

సామాజిక మాధ్యమాల ద్వారా స్టాక్ మార్కెట్ విద్య, పెట్టుబడి సలహాలు అందిస్తున్న ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాథేపై భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ పాఠాల బోధన పేరుతో పెట్టుబడి సలహాలు, రీసెర్చ్ అనలిస్ట్ సేవలందించేందుకు ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవధూత్ సాథేకు చెందిన అవధూత్ సాథే ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌టీఏపీఎల్) సంస్థ, పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన రూ.546.17 కోట్లను, దానిపై రూ.67.87 కోట్ల వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. స్టాక్ మార్కెట్ విద్య పేరుతో అందించే సేవలు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ చర్య మరోసారి స్పష్టం చేస్తోంది.
రిఫండ్ ఆదేశాలతో పాటు అవధూత్ సాథే, ఏఎస్‌టీఏపీఎల్ సంస్థను రెండేళ్ల పాటు లేదా పెట్టుబడిదారుల సొమ్ము పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ రెండింటిలో ఏది ఆలస్యమైతే అప్పటివరకు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. అలాగే, ఈ అకాడమీ, దాని వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, డైరెక్టర్ గౌరీ అవధూత్ సాథేపై కలిపి రూ.11.5 కోట్ల జరిమానా విధించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం, ఆర్థిక సలహాలు అందించే సంస్థలు మార్కెట్ నిబంధనలను పాటించేలా చూడటం లక్ష్యంగా సెబీ ఈ చర్యలు చేపట్టింది. పెట్టుబడులకు సంబంధించిన సేవల కోసం చెల్లింపులు చేసే ముందు సలహాదారులు, రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!