

వైస్ ప్రెసిడెంట్ హోదా కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం (వీఈఓ) పరిధిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులు ఉండవచ్చని అంచనా. భారత్‌లో సంస్థకు దాదాపు 23 వేల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ, వారిలో ఎంతమందికి ఈ ఆఫర్ అందిందనే వివరాలను మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. డిసెంబర్ 1లోపు దరఖాస్తు చేయని ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపైనా స్పష్టత లేదు. క్లౌడ్, ఏఐ, ఆర్థిక, మానవ వనరులు, అజ్యూర్, గేమింగ్, విండోస్ అండ్ డివైజెస్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న పలువురికి ఈ ఆఫర్ అందినట్లు సమాచారం. సెక్యూరిటీ సర్వీసెస్, మార్కెటింగ్ సహా కొన్ని కీలక విభాగాల్లోని నిపుణులకు మినహాయింపు ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.
అమెరికా, భారత్‌లో ఉద్యోగులకు అందించే ప్రయోజనాల్లో తేడాలున్నట్లు సమాచారం. అమెరికాలో అర్హులైన ఉద్యోగులకు సర్వీస్ కాలాన్ని బట్టి గరిష్ఠంగా పది నెలల ప్రాథమిక వేతనానికి సమానమైన పరిహారం, ఆరు నెలల వరకు స్టాక్ ప్రయోజనాలు, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించనున్నట్లు నివేదిక తెలిపింది. భారత్‌లో మాత్రం ఉద్యోగ విరమణ వరకు మాత్రమే స్టాక్ ప్రయోజనాలు లభిస్తాయని, ఆరోగ్య బీమాపై స్పష్టత లేదని పేర్కొంది. మరోవైపు, అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే కొత్త స్పాన్సర్ సంస్థను వెతుక్కోవడం లేదా తమ వలస హోదాను మార్చుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉందంటూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలు కూడా ఈ పరిణామంతో మళ్లీ చర్చకు వచ్చాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!