

తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్‌లో ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)కు చెందిన 25.52 శాతం వాటా త్వరలోనే జీవీకే–భూపాల్ కుటుంబం చేతికి వెళ్లనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఇప్పటివరకు అమలులో ఉన్న వాటాదారుల జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని, దీర్ఘకాలిక మేనేజ్మెంట్ ఒప్పందంగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో జీవీకే–భూపాల్ కుటుంబానికి 74.99 శాతం మెజారిటీ వాటా దక్కనుంది. ఇరవై సంవత్సరాలకు పైగా ఐహెచ్‌సీఎల్‌తో కలిసి జీవీకే–భూపాల్ కుటుంబం దేశవ్యాప్తంగా 1,500కు పైగా గదులు కలిగిన ఏడు స్టార్ హోటళ్లను అభివృద్ధి చేసినట్లు సంస్థ సంయుక్త ఎండీ కృష్ణ భూపాల్ తెలిపారు.
ముంబయి, హైదరాబాద్, చెన్నై, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్న ఈ హోటళ్లు ఆతిథ్య రంగంలో విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గదుల సంఖ్యను 4,000 స్థాయికి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తున్నట్లు వివరించారు. జీవీకే–భూపాల్ కుటుంబంతో ఐహెచ్‌సీఎల్‌కు ఉన్న భాగస్వామ్యం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా నుంచి ముంబయిలోని తాజ్ శాంతాక్రూజ్ వరకు విస్తరించిందని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చత్వాల్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!