

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మంగళవారం మూడు కొత్త బీమా పథకాలను ప్రారంభించింది. న్యూజీవన్ ధారా-2, హెల్త్షీల్డ్, న్యూ క్యాన్సర్ కవర్ పేర్లతో ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. న్యూజీవన్ ధారా-2 అనేది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. పదవీ విరమణ అనంతరం హామీతో కూడిన ఆదాయాన్ని అందించడం దీని లక్ష్యం. హెల్త్షీల్డ్ పథకం మొత్తం కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. ఆస్పత్రిలో చేరినప్పుడు రోజువారీ స్థిర నగదు ప్రయోజనంతో పాటు, పెద్ద శస్త్రచికిత్సలు, తీవ్రమైన అనారోగ్యాల సందర్భాల్లో ఒకేసారి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ఎల్ఐసీ తెలిపింది.
న్యూ క్యాన్సర్ కవర్ పథకం కింద బీమా పొందిన వ్యక్తికి క్యాన్సర్ నిర్ధారణ అయితే, వాస్తవ చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా నిర్ణీత ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. వయోపరిమితిని బట్టి కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది. ఈ పథకం కింద గరిష్ఠ బీమా మొత్తం రూ.50 లక్షలుగా ఉంటుందని, పాలసీదారుడి పేరిట ఇప్పటికే ఉన్న ఇతర పాలసీలను కూడా ఈ పరిమితి నిర్ణయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!