

భారతదేశానికి చెందిన ఎన్‌పీసీఐ ధృవీకృత టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ వియోనా ఫిన్‌టెక్ తన డిజిటల్ చెల్లింపుల సేవలను ఆఫ్రికా దేశాలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జింబాబ్వేలో ‘వియోనా ట్యాప్ అండ్ పే’ ప్లాట్‌ఫారాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంపై జింబాబ్వే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత సాఫ్ట్‌పీఓఎస్ సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాట్‌ఫారం ద్వారా అనుకూలమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు స్వీకరించే టెర్మినల్స్‌గా మార్చుకోవచ్చు. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు ప్రత్యేక పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలను కొనుగోలు చేయకుండానే డిజిటల్ చెల్లింపులను స్వీకరించే అవకాశం ఉంటుంది.
జింబాబ్వేలో యూపీఐ తరహా చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశాలపై ఆ దేశ రిజర్వ్ బ్యాంక్, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వియోనా విస్తరణ ప్రణాళిక ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక అక్వైరింగ్ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వ్యాపార నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు సంస్థ పరిశీలిస్తోంది. ఆఫ్రికానెండా 2025 నివేదిక ప్రకారం, 2024లో ఆఫ్రికా తక్షణ చెల్లింపు వ్యవస్థలు సుమారు 64 బిలియన్ లావాదేవీలను నిర్వహించి, వాటి మొత్తం విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే, వియోనా ట్యాప్ అండ్ పే సేవల వాణిజ్య ప్రారంభం సంబంధిత సర్టిఫికేషన్లు, స్థానిక నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తయిన తర్వాతే జరగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!