

హైదరాబాద్ సిటీ:
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధిక విలువైన సింగిల్ ఆర్డర్‌ను నమోదు చేసిన నగరంగా హైదరాబాద్ నంబర్–1 గా నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఒక హైదరాబాదీ వినియోగదారు ఐఫోన్ల కొనుగోలుకే ఒకే ఆర్డర్లో రూ.4.3 లక్షలు ఖర్చు చేసినట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా పాలు, బంగారం, స్మార్ట్ఫోన్లు, కండోమ్‌లు వంటి వస్తువులకూ భారీగా ఆర్డర్లు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. భారతీయులు క్విక్ కామర్స్ యాప్‌లను ఎలా వినియోగిస్తున్నారనే అంశంపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ‘హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ – 2025’ అనే నివేదికను విడుదల చేసింది. 2025 లో దేశవ్యాప్తంగా తమ ప్లాట్ఫామ్లో నమోదైన ఆర్డర్ల ధోరణిని ఇందులో విశ్లేషించింది. ఒక వినియోగదారు ఈ ఏడాది మొత్తం రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఆ ఆర్డర్లలో 22 ఐఫోన్-17 ఫోన్లు, 24 క్యారెట్ల బంగారు నాణేలు, ఎయిర్ఫ్రయర్తో పాటు పాలు, ఐస్‌క్రీమ్‌లు, తాజా పండ్లు వంటి రోజువారీ అవసరాల వస్తువులు కూడా ఉన్నాయి.
ఇన్‌స్టామార్ట్ ద్వారా భారత్‌లో ప్రతి సెకనుకు నాలుగు పాల ప్యాకెట్లు ఆర్డర్ అవుతున్నాయి. 2025లో ఆర్డర్ చేసిన మొత్తం పాల పరిమాణంతో 26 వేల ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపవచ్చని నివేదిక అంచనా వేసింది.
కండోమ్ ఆర్డర్లలో భారీ వృద్ధి
ఇన్‌స్టామార్ట్‌లో జరిగే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ఆర్డర్ అని స్విగ్గీ తెలిపింది. చెన్నైకి చెందిన ఓ వినియోగదారు కేవలం కండోమ్‌ల కోసమే ఈ ఏడాది రూ.1.06 లక్షలు ఖర్చు చేశాడని, మొత్తం 228 ఆర్డర్లు చేసినట్లు నివేదిక వెల్లడించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా బెంగళూరు నిమిషానికి 1,780 గులాబీ ఆర్డర్లతో రికార్డు సృష్టించింది. మొత్తం మీద ఆ రోజు ప్రతి నిమిషం సగటున 666 ఆర్డర్లు నమోదైనట్లు స్విగ్గీ తెలిపింది. అయితే గులాబీలపై అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం హైదరాబాదీయేనని, ఆయన ఒక్కరోజే రూ.31,240 విలువైన గులాబీలు ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.
ఇతర ఆసక్తికర అంశాలు
బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారు నూడిల్స్ కోసం రూ.4.36 లక్షలకు పైగా ఖర్చు చేయగా, చెన్నైలో ఓ పెట్ పేరెంట్ తన పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ.2.41 లక్షలు వెచ్చించాడు. ముంబైలో ఓ వినియోగదారు బంగారం కొనుగోలుకు రూ.15.6 లక్షలు ఖర్చు చేయగా, మరో బెంగళూరు వినియోగదారు రూ.1.7 లక్షల విలువైన ఐఫోన్‌తో పాటు 178 లైమ్ సోడాలను ఒకే ఆర్డర్లో బుక్ చేయడం గమనించదగినది. టిప్స్ రూపంలో ఇచ్చే విరాళాల్లోనూ నగరాల మధ్య పోటీ కనిపించింది. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారు రూ.68,600 టిప్స్‌గా ఇవ్వగా, చెన్నై వాసి ఒకరు రూ.59,505 టిప్స్‌గా చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!