

దేశంలో ఎఫ్‌ఎంసీజీ (వినియోగదారుల నిత్యావసర వస్తువుల) ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై–సెప్టెంబరు త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీలపై వ్యయాల భారం అధికమైంది. పామాయిల్ ధర ఏడాదితో పోలిస్తే 21 శాతం, చక్కెర ధర 18 శాతం పెరిగాయి. ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు, ప్యాకేజింగ్ సామగ్రి ధరలు కూడా పెరగడంతో కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి నెలకొంది. పండగల సమయంలో వినియోగదారుల కొనుగోళ్లు తగ్గకుండా ఉండేందుకు ప్రస్తుతం ధరల పెంపును వాయిదా వేస్తున్న సంస్థలు.. డిసెంబరు నుంచి ధరలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఖర్చులను నియంత్రించేందుకు డిస్కౌంట్లు తగ్గించడం, ప్రకటనల వ్యయాలను పరిమితం చేయడం వంటి చర్యలు చేపడుతున్నాయి.
ధరలు పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తక్కువ ధర కలిగిన బ్రాండ్లకు మారడం లేదా చిన్న ప్యాకెట్లు కొనుగోలు చేయడం వల్ల విక్రయాల పరిమాణం తగ్గే ప్రమాదం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ దిగుబడులపై పడితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ కమొడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి డిసెంబరు నుంచి ధరల పెంపు ఉండవచ్చని పార్లే ప్రోడక్ట్స్ ముఖ్య మార్కెటింగ్ అధికారి మయాంక్ షా తెలిపారు. నెస్లే ఇండియా సీఎండీ మనీశ్ తివారీ కూడా ఆహార ద్రవ్యోల్బణం సవాలుగా మారిందని పేర్కొన్నారు. కాఫీ, గోధుమ ధరలు కొంత స్థిరంగా ఉండవచ్చని, చక్కెర, వంట నూనెల ధరలు గరిష్ఠ స్థాయిల్లో కొనసాగవచ్చని అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా కోకో ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!