

ఎల్‌నినో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు బలంగా కొనసాగవచ్చని ప్రస్తుత అధ్యయనాలు సూచిస్తున్నట్లు ఇన్‌కాయిస్ శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాన్సిస్ ఎ. పవనతార వెల్లడించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు పైపొరల్లో ఉష్ణ నిల్వ అధికమవడం, సముద్ర ఉష్ణ తరంగాలు విస్తరించడం వంటి పరిణామాలు వర్షపాతం, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, మత్స్య సంపద, తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతాయని వివరించారు. దీర్ఘకాలం సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే పగడపు దిబ్బలు దెబ్బతినడంతో పాటు చేపల వలసలు, సంతానోత్పత్తి, చిన్న చేపల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడవచ్చని తెలిపారు. ఈ మార్పులకు కారణాలు, వాటి ప్రభావాలను అర్థం చేసుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమగ్ర అధ్యయనం చేపట్టాలని ఇన్‌కాయిస్ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఎల్‌నినోతో పాటు హిందూ మహాసముద్రంలో తూర్పు, పడమర ప్రాంతాల మధ్య సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాన్ని సూచించే ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) కూడా భారత రుతుపవనాలపై ప్రభావం చూపుతుందని పవనతార వివరించారు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఐఓడీ ఎల్‌నినో వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను కొంతవరకు తగ్గించగలదని చెప్పారు. అయితే, ఐఓడీని ముందుగానే కచ్చితంగా అంచనా వేయడానికి ఇంకా మెరుగైన వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ఎల్‌నినో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఐఓడీ ఎప్పుడు ఏర్పడుతుంది అనే అంశాలు రుతుపవనాల అంచనాలకు కీలకమని తెలిపారు. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ఎల్‌నినో ఫిబ్రవరి వరకు బలంగా ఉండి, మార్చి నుంచి బలహీనపడే దశలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, ఆ తర్వాతి పరిస్థితులను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!