

2026–27 సరఫరా సంవత్సరానికి (2026 నవంబరు నుంచి 2027 అక్టోబరు వరకు) పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్ సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచి, ధరలను నియంత్రించాలనే లక్ష్యంతో చెరకు ఆధారిత ఇథనాల్ కొనుగోళ్లను తాజా టెండర్‌లో నిషేధించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల తరఫున భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) అక్టోబరు 16న ఇథనాల్ సేకరణకు టెండర్ జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం చెరకు రసం, చక్కెర లేదా షుగర్ సిరప్, బి-హెవీ మొలాసెస్ నుంచి తయారైన ఇథనాల్‌కు బిడ్లు స్వీకరించరు. అయితే మొక్కజొన్న, నూకలు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సేకరించిన మిగులు బియ్యం, సి-హెవీ మొలాసెస్ నుంచి ఉత్పత్తి చేసిన ఇథనాల్‌కు అనుమతి ఇచ్చారు.
మరోవైపు మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ సేకరణ ధరను లీటరుకు రూ.71.86 నుంచి రూ.68.86కు తగ్గించారు. లీటరుపై ఇచ్చే అదనపు ప్రోత్సాహకాన్ని కూడా రూ.5.79 నుంచి రూ.2.79కు తగ్గించారు. దీంతో మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిదారుల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. చెరకు ఆధారిత ముడిసరుకులకు అనుమతి లేకపోవడంతో ధాన్యాల నుంచి ఇథనాల్ తయారు చేసే డిస్టిలరీలకు ప్రాధాన్యం పెరగనుంది. చక్కెర సరఫరాను కాపాడుతూ పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని కొనసాగించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!