

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళిక రూపొందించారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాన్ని అమలు చేయగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కార్యరూపంలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఆదివారం దక్షిణ గోవాలోని మార్గావ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తనపై 45కు పైగా పరువు నష్టం కేసులు ఉన్నాయని, అయితే ఓట్ల చోరీ ఆరోపణలపై మాత్రం కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. అలాంటి కేసు నమోదైతే అది పూర్తిస్థాయి చట్టపరమైన వ్యవహారంగా మారుతుందనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ‘గోవా రక్షణ యాత్ర’లో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన సుమారు రెండు కిలోమీటర్లు నడిచారు.
మరోవైపు, భారత్‌లో ఫ్రాన్స్, బంగ్లాదేశ్ తరహా హింసను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులతో పాటు కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్, బంగ్లాదేశ్‌లలో జరిగిన పరిణామాలను భారత్‌లో పునరావృతం చేయాలనే ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ మార్పు సాధ్యమేనని, అయితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే జరగాలని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!