

అంగారకుడి ఉపగ్రహమైన ఫోబోస్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) మార్షియన్ మూన్స్ ఎక్స్‌ప్లొరేషన్ (ఎంఎంఎక్స్) మిషన్‌ను చేపడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంగారకుడి చందమామ నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా జపాన్ చరిత్ర సృష్టించనుంది. అంగారకుడికి ఫోబోస్, డైమోస్ అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. అంగారకుడిని భారీ ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాలే ఈ ఉపగ్రహాలని కొందరు భావిస్తుండగా, మరికొందరు ఇవి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రహశకలాలని అంచనా వేస్తున్నారు. ఫోబోస్ నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణ ఈ రహస్యాలను ఛేదించేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
సుమారు ఐదు టన్నుల బరువున్న ఎంఎంఎక్స్ వ్యోమనౌకలో ప్రొపల్షన్, ఎక్స్‌ప్లొరేషన్, రిటర్న్ అనే మూడు మాడ్యూల్స్ ఉంటాయి. అంగారకుడి పరిసరాలకు చేరుకున్న తర్వాత ఈ మిషన్ మూడేళ్లపాటు ఫోబోస్ సమీపంలో పరిశోధనలు నిర్వహించి, కనీసం 10 గ్రాముల నమూనాలను సేకరించనుంది. అనంతరం రిటర్న్ మాడ్యూల్ ద్వారా 2031లో భూమికి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్, జర్మనీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఐడెఫిక్స్ రోవర్ 2029లో ఫోబోస్‌పై దిగుతూ ఈ పరిశోధనకు తోడ్పడనుంది. ఈ మిషన్ ద్వారా ఫోబోస్, డైమోస్ ఆవిర్భావంతో పాటు సౌర కుటుంబంలో జీవం ఆవిర్భవించిన తీరుపై కొత్త ఆధారాలు లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలకు ఫోబోస్‌ను మధ్యంతర కేంద్రంగా ఉపయోగించవచ్చా అనే అంశంపైనా పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!