ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో ఔషధాలు అందించాలనే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డి తమ ప్రయాణాన్ని ప్రారంభించారని సంస్థ సహ ఛైర్మన్ మరియు ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఔషధాల ఉత్పత్తి కేవలం కంపెనీల లాభాల కోసం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలనే దృక్పథంతోనే డాక్టర్ అంజి రెడ్డి పనిచేశారని ఆయన పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఇప్పటికీ ముందుకు సాగుతోందని, ఈ దృక్పథం వల్లే ప్రపంచానికి అవసరమైన ఔషధాలను భారత్ సమర్థంగా సరఫరా చేయగలుగుతోందని అన్నారు.
డాక్టర్ అంజి రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన డాక్టర్ అంజి రెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమాన్ని జీవీ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆవిష్కరణలకు దారితీయడమే లక్ష్యమని డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. వైద్య పరిశోధనలలో కొత్త దిశలను ఆవిష్కరించేలా ఈ స్మారకోపన్యాసాలు ప్రేరణనిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రపంచ ప్రఖ్యాత కణ జీవ శాస్త్రవేత్త, పరిశోధకుడు ప్రొఫెసర్ గైడో క్రోమెర్ హాజరయ్యారు. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ (అపోప్టోసిస్), ఆటోఫాగి, క్యాన్సర్ నిరోధకతపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం పారిస్ సిటీ విశ్వవిద్యాలయంలో వైద్య అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన ‘ఎ టిష్యూ స్ట్రెస్ హార్మోన్ డ్రైవింగ్ పాథలాజికల్ ఏజింగ్’ అనే అంశంపై స్మారకోపన్యాసం అందించారు. ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ గురు ఎన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!