

స్విట్జర్లాండ్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ లాజిటెక్ భారత్‌లో తన తయారీ కార్యకలాపాలను విస్తరిస్తోంది. చైనాపై తయారీ ఆధారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా హర్యానాలోని మనేసర్ కేంద్రంలో కంప్యూటర్ మౌస్‌లు, వెబ్‌క్యామ్‌ల వంటి ఉత్పత్తుల అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. భారత్‌లో బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు కన్జ్యూమర్ (B2C) మార్కెట్లు విస్తరిస్తుండటంతో స్థానిక వినియోగదారులకు మరింత చేరువ కావాలని సంస్థ భావిస్తోంది. స్థానికంగా ఉత్పత్తులను అసెంబుల్ చేయడం వల్ల రవాణా సమయం తగ్గడంతోపాటు సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని లాజిటెక్ ప్రతినిధులు తెలిపారు. భారత్ తమ సంస్థకు ఏడో తయారీ కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉత్పత్తుల అసెంబ్లింగ్‌పై దృష్టి సారించిన లాజిటెక్, భవిష్యత్తులో స్థానిక భాగస్వాములతో కలిసి విడిభాగాల తయారీ సామర్థ్యాలను కూడా విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం భాగస్వామ్య సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, నాణ్యత నియంత్రణ ప్రమాణాలపై శిక్షణ అందించనుంది. చెన్నైలో లాజిటెక్కు పరిశోధన, అభివృద్ధి (R&D) కేంద్రం కూడా ఉంది. ఇందులో 500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, డేటా విశ్లేషణ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అభివృద్ధి వంటి రంగాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సంస్థ ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో తయారయ్యే ఉత్పత్తులు కూడా ప్రపంచస్థాయి నాణ్యత, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!