

టీ20 క్రికెట్లో భారీ స్కోర్లు పెరుగుతున్న నేపథ్యంలో పిచ్‌లు బౌలర్లకు కూడా సహకరించేలా ఉండాలని భారత మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సూచించారు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ మినహా మిగిలిన మూడు మ్యాచుల్లోనూ 200కుపైగా పరుగులు నమోదయ్యాయని ఆయన ప్రస్తావించారు. నిర్ణయాత్మక మ్యాచ్ బెంగళూరులో జరగనున్న నేపథ్యంలో, అక్కడి పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య చేతన్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. అభిమానులు ఫోర్లు, సిక్సర్లు చూడటానికి ఇష్టపడినా.. బ్యాట్, బంతి మధ్య సమతుల్య పోటీ లేకపోతే మ్యాచ్‌లు ఏకపక్షంగా మారతాయని అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్లో బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు.
మరోవైపు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల వయసుపై జరిగే చర్చలపైనా చేతన్ శర్మ స్పందించారు. ఆటగాళ్ల ఎంపికలో వయసు కంటే ప్రదర్శనకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం సెంచరీలు సాధిస్తూ తమ సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. బయట నుంచి వచ్చే విమర్శలు, వ్యాఖ్యలపై స్పందించడం కంటే జట్టు కోసం మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే ఆటగాళ్లు దృష్టి పెట్టాలని అన్నారు. జట్టు విజయానికి అవసరమైన సహకారం అందిస్తూ, నిలకడగా రాణించే ఆటగాళ్లకు వయసుతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పించాలని చేతన్ శర్మ అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!