

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా రోహిత్ ఎలిమినేషన్‌పై పలువురు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అతడిని అన్యాయంగా బయటకు పంపించారంటూ షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జునపైనా కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టిన హౌస్‌లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఈసారి ప్రధానంగా ముఖేష్, వర్షిణి లక్ష్యంగా హౌస్‌మేట్స్ తమ విమర్శలు ఎక్కుపెట్టారు. గత వారం జరిగిన వివాదాలు, వ్యక్తిగత విభేదాలు నామినేషన్లలో ప్రస్తావనకు రావడంతో వంశీ, ముఖేష్ మధ్య మాటల యుద్ధం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్లలో ముఖేష్‌ను ఎంచుకున్న వంశీ.. గత వారం ‘బీ’, ‘పీ’ అనే పదాల విషయంలో జరిగిన గొడవను ప్రస్తావించాడు. ముఖేష్ మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని, ఆయన ప్రవర్తన వల్ల ఝాన్సీ ఇబ్బంది పడటమే కాకుండా ఏడ్చిందని ఆరోపించాడు. వర్షిణిని కూడా నామినేట్ చేసిన వంశీ.. తనకు నచ్చని వ్యక్తులను ఆమె నామినేట్ చేయడం లేదని విమర్శించాడు. ఈ సమయంలో ముఖేష్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో వంశీ ఘాటుగా స్పందించాడు. మీలో ఒకరిని నామినేట్ చేస్తే ఇద్దరూ ఎందుకు మధ్యలోకి వస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. మరోవైపు త్రిగుణ్ కూడా శివతో మాట్లాడుతూ ‘బీ’ అంటే బ్రోకర్, ‘పీ’ అంటే పప్పెట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. సుధీర్, వంశీ మధ్య కూడా వాదన జరిగింది. వంశీ కోపాన్ని చూసి భయపడుతున్నానని సుధీర్ చెప్పగా, తనపైకి వస్తే తన కోపం అలాగే ఉంటుందని వంశీ సమాధానమిచ్చాడు. కెమెరాల ముందు ఎంతకాలం నటిస్తామని సుధీర్ ప్రశ్నించగా, అది నీ నటనపై ఆధారపడి ఉంటుందని వంశీ కౌంటర్ ఇచ్చాడు.
మరోవైపు సుధీర్ అమన్‌ను నామినేట్ చేస్తూ, తనను హౌస్ నుంచి బయటకు పంపించే విషయంలో అమన్ తీసుకున్న నిర్ణయం స్నేహితుడిగా తనకు నచ్చలేదని చెప్పాడు. దీనికి అమన్ స్పందిస్తూ, రెండు చప్పట్లు కొడితేనే స్నేహం అవుతుందా? అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శ్వేతా నాయుడు కూడా ముఖేష్‌ను నామినేట్ చేస్తూ ఆయన దూకుడైన ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శివ కుమార్ స్పందిస్తూ, ముఖేష్ ఆట కారణంగానే ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లిందని వ్యాఖ్యానించాడు. ఇక నీతూ వర్షిణిని నామినేట్ చేస్తూ, అక్కాతమ్ముడి అనుబంధం కారణంగా ఆమె గ్రీన్ లెవల్‌కు చేరుకుందని అభిప్రాయపడింది. గత వారాంతంలో కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నాగార్జున చెప్పిన విషయాన్ని దేబ్జానీ గుర్తుచేయడంతో వర్షిణి ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. ఇదిలా ఉండగా, తొమ్మిదో వారం నామినేషన్లలో ముఖేష్, వర్షిణి, సుధీర్, నీతూ, రామకృష్ణ, శివ కుమార్, వంశీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జాబితాపై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పాత గొడవలు, వ్యక్తిగత విభేదాలతో ఈ వారం నామినేషన్లు ఉత్కంఠగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!