

సినిమా: మోగ్లీ 2025
నటీనటులు: రోషన్ కనకాల, సాక్షి మాధోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు
దర్శకుడు: సందీప్ రాజ్
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2025
కలర్ ఫోటోతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ నుంచి వచ్చిన రెండో సినిమా మోగ్లీ 2025. అయితే ఈసారి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది.
పార్వతీపురం నేపథ్యంలో సాగే ఈ కథలో మోగ్లీ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా పెరుగుతాడు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని పోలీస్ కావాలని కలలు కంటాడు. గ్రామానికి సినిమా షూటింగ్ రావడంతో డూప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తాడు.
అక్కడే మాటలు వినలేని, మాట్లాడలేని నర్తకి జాస్మిన్ను ప్రేమిస్తాడు. అయితే ఓ నిర్మాత, తర్వాత స్థానిక పోలీస్ అధికారి ఆమె పై కన్నేయడంతో పరిస్థితులు మారతాయి. చివరికి మోగ్లీ–జాస్మిన్ అడవుల్లోకి పారిపోవాల్సి వస్తుంది.
మిగతా కథ అంతా మోగ్లీ ఆమెను ఎలా కాపాడతాడన్నదే.
రోషన్ కనకాల యాక్షన్ సన్నివేశాల్లో ఓకే అనిపించినా, పాత్ర అతనికి పూర్తిగా సరిపడలేదు.
సాక్షి మాధోల్కర్ మాటలు లేకుండానే భావోద్వేగాలను వ్యక్తం చేసి సినిమాకు బలం ఇచ్చింది.
విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ ప్రభావం చూపించినా, పాత్ర డిజైన్ ఒకేలా ఉండడంతో అలసట కలిగిస్తుంది.
హర్ష చెముడు పాత్ర పరిమితంగానే ఉన్నా సరిపడా వినోదం అందించాడు.
సినిమాకు మంచి ప్రొడక్షన్ విలువలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కానీ సంగీతం పెద్దగా గుర్తుండిపోయేలా లేదు. ఎడిటింగ్ మరింత కుదించి ఉంటే సినిమా మెరుగ్గా ఉండేది.
సినిమాలో భక్తి, పురాణాల ప్రస్తావనలు ఉన్నా అవి కథతో బలంగా కలవవు. ప్రేమలో ఉన్న అమ్మాయి పై విలన్ కన్నేయడం, హీరో పారిపోవడం వంటి అంశాలు కొత్తగా అనిపించవు.
డైలాగ్స్ కొన్ని సందర్భాల్లో బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తాయి. రెండో భాగం పూర్తిగా పాత సినిమాల స్టైల్ ను గుర్తు చేస్తుంది. పాటలు ఆకట్టుకోకపోవడం, నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్.
మంచి ఆలోచన ఉన్నా, పాత కథనం, సాగదీత, కొత్తదనం లేకపోవడం వల్ల మోగ్లీ 2025 ప్రేక్షకులను అలరించలేకపోయింది. టైటిల్ తప్ప సినిమా ఆధునికంగా అనిపించదు.
ఫైనల్ మాట: విసుగుతో కూడిన ప్రేమకథ
రేటింగ్: 2/5










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!