

టాలీవుడ్‌లో ప్రభాస్, రాజమౌళి కలయికకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గతంలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ చిత్రాలతో ఈ ఇద్దరూ సృష్టించిన విజయాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతుందనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని రూపొందిస్తున్న రాజమౌళి, తన తదుపరి సినిమాపై కూడా ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయాలని ఆయన భావిస్తున్నారనే చర్చ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలున్నాయి. వీటన్నింటినీ 2028 నాటికి పూర్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజమౌళి సినిమాకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించనున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే ప్రస్తుతం కొత్త చిత్రాలకు అంగీకారం తెలపడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగే. ‘బాహుబలి’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!