

తెలంగాణలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ‘పీఎస్ఆర్ యువ నేస్తం’ పేరుతో ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. తన జన్మదినం సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో ఏడాది పాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కోచింగ్ ఫీజులు, దూరప్రాంతాల సమస్యలు యువత లక్ష్యాలకు అడ్డంకులు కాకూడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 15 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని వెల్లడించారు. గతంలో ఖమ్మం ప్రాంతంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా 462 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు.
తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం చర్చకు వచ్చిందని పొంగులేటి తెలిపారు. వచ్చే దీపావళిలోగా ఈ సమస్య పరిష్కారానికి సీఎం అంగీకరించినట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌ను తొలగించిన విషయాన్ని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పునరుద్ధరించిందన్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపట్టనున్న పాదయాత్రపై స్పందిస్తూ, ఢిల్లీలో నిరసనలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణలో పాదయాత్రలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సమగ్ర పునఃపరిశీలన జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్, ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్లే వారికి అదనపు రైలు బోగీలు కేటాయించాలన్న అభ్యర్థనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!