

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా అభివృద్ధి, ఐటీ, టెక్నాలజీ వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడతారనే విమర్శలు ఎదుర్కొన్నారు. వ్యవసాయాన్ని తక్కువగా పట్టించుకుంటారనేది గతంలో వచ్చిన అభిప్రాయం. అయితే కడప జిల్లా కమలాపురంలో జరిగిన ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విమర్శలను ఖండిస్తూ రైతుల కోసం “పంచ వ్యవసాయ సూత్రాలు” ను ప్రకటించారు. ఇవి పాటిస్తే రైతులకు లాభదాయకం, స్థిరమైన సాగు సాధ్యమవుతుందని చెప్పారు.
వ్యవసాయం తనకు ప్రాధాన్యమేనని స్పష్టం చేసిన చంద్రబాబు, ఈ ఐదు సూత్రాలు రైతులకు దీర్ఘకాలిక భద్రతను అందిస్తాయని అన్నారు. ఇవి అమలు చేస్తే రైతుల పరిస్థితి భారీ స్థాయిలో మెరుగవుతుందని, “రైతులు మీసం మెలిపెట్టే స్థాయికి ఎదుగుతారు” అని అన్నారు.
ఐదు వ్యవసాయ సూత్రాలు
1. నీటి భద్రత:
రైతులు నీటిని ఆదా చేస్తూ సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలను ఎంచుకోవాలని, అలాగే నీటి సంరక్షణ పద్ధతులను ప్రాజెక్టులలో అమలు చేయాలని చెప్పారు.
2. డిమాండ్ ఆధారిత పంటలు:
మనకు నచ్చిన పంటలు కాకుండా, ప్రజలకు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఎక్కువగా వినియోగించే ఆహారాన్ని ప్రభుత్వం గుర్తించి మార్గనిర్దేశనం చేస్తుంది. దీంతో రైతులకు మంచి ధర లభిస్తుంది, సాగు భారం తగ్గుతుంది.
3. అగ్రిటెక్ వినియోగం:
డ్రోన్లతో ఖచ్చితమైన పిచికారీ, భూమి పరీక్షలు, తెగుళ్ల గుర్తింపు, వాతావరణ మార్పుల విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతికతను రైతులు అలవరచుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫార్మింగ్ వల్ల ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని అన్నారు.
4. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు:
రైతులే చిన్నపాటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న, పండ్ల వంటి ఉత్పత్తులకు విలువ పెంచుకోవాలని సూచించారు. దీంతో వెంటనే మార్కెట్‌పై ఆధారపడకుండా అదనపు ఆదాయం పొందవచ్చు.
5. గ్లోబల్ మార్కెట్ లక్ష్యం:
పంటలను కేవలం జిల్లా లేదా రాష్ట్రంలోనే అమ్ముకోవడం కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. నాణ్యత ఉన్న పంటలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ దొరుకుతుందని, దీని ద్వారా రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పారు.
చంద్రబాబు పేర్కొన్న ఈ ఐదు సూత్రాలు విస్తృతంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోతుందని ఆయన నమ్మకవ్యక్తం చేశారు. ఇలా రైతుల గురించి స్పష్టంగా మాట్లాడిన తర్వాత “చంద్రబాబుకు వ్యవసాయం అంటే గిట్టదా?” అని ప్రశ్నిస్తూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!