

దక్షిణ భారతీయ సినీ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. సౌత్ ఇండస్ట్రీలో తన పెట్టుబడులు, భాగస్వామ్యాలను మరింత పెంచుతూ 2026లో మిగిలిన కాలంలో ప్రతి వారం ఒక కొత్త తెలుగు, తమిళ లేదా మలయాళ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. చెన్నైలో జరిగిన తాజా ఈవెంట్‌లో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కొత్త కంటెంట్ ప్లాన్‌లో భాగంగా ఆగస్టు 21న ప్యార్ ప్రేమ కాదల్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీనితో పాటు రామ్ చరణ్, ధనుష్, విజయ్ దేవరకొండ, నాని తదితర స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులు కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నాయని సంస్థ తెలిపింది. రామ్ చరణ్ నటించిన పెద్ది ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం థియేట్రికల్ సినిమాలకే పరిమితం కాకుండా సౌత్ భాషల్లో ఒరిజినల్ కంటెంట్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ విస్తరిస్తోంది. తెలుగులో తొలి ఒరిజినల్ సిరీస్‌గా సూపర్ సుబ్బును రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. తమిళంలో ద గేమ్‌తో పాటు స్టీఫెన్, తక్షకుడు, లెగసీ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.
సౌత్ సినిమాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను కూడా నెట్‌ఫ్లిక్స్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2023 నుంచి తెలుగు, తమిళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల్లో 50 శాతానికి పైగా సినిమాలు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2025లో ఏకంగా 59 దేశాల్లో దక్షిణాది సినిమాలు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు.
ప్రతి వారం కొత్త సౌత్ సినిమా, స్టార్ హీరోల చిత్రాలు, ప్రాంతీయ ఒరిజినల్ సిరీస్‌లతో నెట్‌ఫ్లిక్స్ దక్షిణాది కంటెంట్‌పై మరింత దృష్టి పెడుతోంది. ఈ కొత్త వ్యూహం తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు నిరంతరం కొత్త కంటెంట్ అందించడంతో పాటు సౌత్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!