

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నడ స్టార్ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా ‘ఆన్ డ్యూటీ’ పేరుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజీవ్ మేగోటి.. ఇప్పుడు కన్నడలో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ కథల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర ఈ కొత్త కథకు అంగీకరించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆయన నటించిన ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.
సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’కు థియేటర్లలో మంచి స్పందన లభించిందని, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లోనూ ఈ చిత్రం ట్రెండింగ్‌లో కొనసాగుతోందని చిత్ర బృందం పేర్కొంది. పుష్కరకాలం విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో సంజీవ్ మేగోటి మళ్లీ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. క్రైమ్, యాక్షన్ నేపథ్యంతో సరికొత్త కథ, విభిన్నమైన కథనంతో ‘ఆన్ డ్యూటీ’ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!