

డిసెంబర్ 25 న విడుదలైన సినిమాల్లో ‘శంబాల’ ప్రేక్షకుల నుంచి ఏకగ్రీవంగా హిట్ టాక్ తెచ్చుకుంది. బ్లాక్‌బస్టర్ స్థాయిలో నిలిచి నిర్మాతలకు లాభాలు అందించడమే కాక క్రిస్మస్ విన్నర్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరో ఆది సాయి కుమార్‌కు ఈ సినిమా మంచి బ్రేక్‌గా మారింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ప్రవీణ్ కె బంగారి కెమెరా వర్క్, శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కొత్త కథాంశం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన తీరు కలిసి రావడంతో సినిమా విజయం సాధించింది.
ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ‘శంబాల’ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరై చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించారు. దిల్ రాజు మాట్లాడుతూ, క్రిస్మస్కు విడుదలైన ఐదు సినిమాల్లో ‘శంబాల’ సక్సెస్ కావడం గొప్ప విషయం అన్నారు. సినిమా విడుదలైనప్పుడు విదేశాల్లో ఉన్నప్పటికీ ‘శంబాల’కి 100 శాతం పాజిటివ్ టాక్ వస్తోందని విన్నానని తెలిపారు. ఇది ఆది సాయి కుమార్ 25 వ సినిమా కావడం, ఆ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయి కుమార్ తన కుమారుడి సక్సెస్ కోసం చూపిన సహకారం, చిత్రయూనిట్‌కు ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులను ఒక సినిమాతో మెప్పించడం కష్టమని, ‘శంబాల’ అది చేసి చూపిందని చెప్పారు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, థ్యాంక్స్ మీట్‌కు దిల్ రాజు రావడం తమ టీమ్‌కు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తీవ్ర పోటీ మధ్య విడుదలైనప్పటికీ సినిమా ఇంకా మంచి రన్‌తో కొనసాగుతుండటం సంతోషంగా ఉందని చెప్పారు. మౌత్ టాక్ ద్వారా సినిమాను ముందుకు తీసుకెళ్లిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాయి కుమార్ మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ మరోసారి నిరూపించిందన్నారు. దేశ విదేశాల నుంచి అభినందనలు వస్తున్నాయని, ఈ నెల 9 న హిందీలో విడుదలవుతున్న సినిమా అక్కడ కూడా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్, హీరోయిన్ అర్చన అయ్యర్ కూడా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలిపారు. అనంతరం దిల్ రాజు చిత్రయూనిట్ సభ్యులందరికీ మెమెంటోలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!