

గద్దర్ అవార్డు అందుకున్న ఉత్తేజంతో నిర్మాత బూసం రవీంద్రనాథ్ త్వరలో తన రెండో చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తొలి ప్రయత్నంగా రూపొందించిన ‘వనజీవి రామయ్య’ చిత్రం దరిపల్లి రామయ్య జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. “చెట్ల రామయ్య”గా ప్రసిద్ధి పొందిన ఆయన చెట్లను నాటడం, పరిరక్షించడం అనే లక్ష్యంతో జీవించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న ఈ మహనీయుని జీవితం “వృక్షో రక్షతి రక్షిత” అనే ట్యాగ్ లైన్‌తో వేముగంటి దర్శకత్వంలో తెరకెక్కింది. బి.ఆర్. మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డులో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికై రూ.5 లక్షల నగదు బహుమతిని అందుకుంది.
తన తొలి ప్రయత్నమే విజయవంతం కావడంతో రవీంద్రనాథ్ ప్రస్తుతం రెండో సినిమా కోసం కథాచర్చలు జరుపుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎం.పి.టి.సి గా సేవలందిస్తున్న ఆయన స్థిరాస్తి వ్యాపారిగా కూడా ఉన్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తన తొలి చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు బ్రహ్మాజీతో పాటు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మరియు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నుంచి వచ్చిన ప్రశంసలు తనకు మరింత ప్రేరణనిచ్చాయని చెప్పారు. చిరంజీవిని కలిసినప్పుడు ‘ఠాగూర్’ లాంటి సినిమా చేయాలన్న తన కలను చెప్పగా, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం తనకు అపారమైన ధైర్యాన్ని ఇచ్చిందని రవీంద్రనాథ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!