

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్, హిస్టారికల్ చిత్రం ‘రణబాలి’. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాతో ఆయన బలమైన కంబ్యాక్ ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగే కథగా ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది. తెలుగు మట్టికి చెందిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను రూపొందిస్తున్నట్టు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే అప్పటి సామాజిక పరిస్థితులు, తిరుగుబాట్లు, పోరాటాలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. అయితే చివర్లో కనిపించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలు మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.
టీజర్ చివరి క్షణాల్లో కనిపించిన కొన్ని విజువల్స్‌కి ఫాంటసీ ఛాయలు ఉన్నాయా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కథలో ఇలాంటి అంశాలను ఎలా జోడించారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ సన్నివేశాలు నిజమైన సంఘటనలకు సంబంధించినవే అయితే వాటి వెనుక ఉన్న కథ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. లేదంటే దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తనదైన కల్పనతో కథకు కొత్త కోణాన్ని జోడించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!