

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్టోబర్ 25న స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందిస్తున్న ప్రవాస తెలంగాణ ప్రజలను ఆయన అభినందించారు. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటకం, ఫిల్మ్ టూరిజం, ఆతిథ్య రంగాల్లో తెలంగాణ–స్విట్జర్లాండ్ మధ్య పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జూపల్లి తెలిపారు. లైఫ్ సైన్సెస్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో స్విట్జర్లాండ్‌తో భాగస్వామ్యాలకు మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని స్విస్ కంపెనీలకు ఆయన ఆహ్వానం పలికారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలంగాణ సంస్కృతికి రాయబారులుగా కొనసాగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్‌కు, పాల్గొన్న తెలుగు కుటుంబాలకు అభినందనలు తెలిపారు. బెర్న్‌కు చేరుకున్న జూపల్లి కృష్ణారావుకు విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!