

తెలుగు చిత్రాల్లో పలు కీలక పాత్రలు పోషించిన నటి పూజిత పొన్నాడ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘సిగ్నల్ అట్ 11.30’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆమె కోలీవుడ్‌లో కథానాయికగా పరిచయం కానున్నారు. మలర్ వళీ నటేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలర్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో సంతోష్ ప్రతాప్ హీరోగా నటిస్తుండగా, పూజిత పొన్నాడ, భవ్య త్రికా కథానాయికలుగా కనిపించనున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందించారు.
కోలీవుడ్‌లో కథానాయికగా పరిచయం కావడం ఆనందంగా ఉందని పూజిత పొన్నాడ తెలిపారు. ఈ సినిమా తన సినీ ప్రయాణంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జన్మించిన ఆమె, చెన్నైలో కంప్యూటర్ సైన్స్ చదివి, హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. నాట్యం, చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న ఆమె, అనుకోకుండా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ‘పరిచయం’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మొదలైన ఆమె నటనా ప్రయాణం, ఆ తర్వాత ప్రకటనల్లో నటించే స్థాయికి చేరింది. దర్శకుడు సుకుమార్ దృష్టిలో పడటంతో ‘దర్శకుడు’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అనంతరం రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’తో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘సిగ్నల్ అట్ 11.30’తో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!