

తమిళనాడులో నటుడు అజిత్ కుమార్ అభిమానులు ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. కల్లకురిచి జిల్లా ఉళుందూరుపేట సమీపంలోని ఎలవనాసురుకోట్టైలో జరిగిన కార్యక్రమంలో 38 జిల్లాలకు చెందిన అభిమాన సంఘాల నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా మధ్యలో రెండు చిరుతపులుల చిత్రాలను ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆబీత్, కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహ్మద్ షాను నియమించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అజిత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించేందుకు ఆ పదవిని ఖాళీగా ఉంచినట్లు పార్టీ నిర్వాహకులు వెల్లడించారు. అయితే ఈ పార్టీని అజిత్ స్వయంగా ప్రారంభించినట్లు ఎలాంటి సమాచారం లేదు. అంతేకాదు, 2019లో అజిత్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. తన పేరు, ఫొటోను ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ ఉపయోగించవద్దని కూడా కోరారు. దీంతో అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కొత్త పార్టీపై అజిత్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!