

హాలోవీన్ వేడుకల నేపథ్యంలో ప్రేక్షకులను భయపెట్టే సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా విదేశీ దెయ్యాల కథలకే ప్రాధాన్యం ఇచ్చే ఈ వేడుకల్లో ఈసారి భారతీయ హారర్ చిత్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దురాశ, చేతబడులు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన సినిమాలు థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో తుంబాడ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. దురాశ చుట్టూ అల్లుకున్న కథాంశం ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన భూత్, అజయ్ దేవగన్, ఊర్మిళ నటనతో ఆకట్టుకుంది. అలాగే అక్షయ్ కుమార్, విద్యాబాలన్ నటించిన బూల్ బులయ్యా కామెడీతో పాటు భయాన్ని అందిస్తుంది. బిపాసా బసు నటించిన రాజ్ కూడా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మాధవన్ నటించిన 13B టెలివిజన్ కథ నిజ జీవితంలోకి రావడం అనే వినూత్న అంశంతో ఆకట్టుకుంటుంది. మరోవైపు అజయ్ దేవగన్ నటించిన శైతాన్, మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన భ్రమయుగం కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మూఢనమ్మకాలు, పురాణాలు, అతీంద్రియ శక్తులను ఆధారంగా చేసుకున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. విదేశీ చిత్రాలకే పరిమితం కాకుండా భారతీయ కథల్లోని భయానక కోణాలను కూడా ఆస్వాదించాలనుకునే వారికి ఈ హాలోవీన్ వాచ్‌లిస్ట్ మంచి ఎంపికగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!