

భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు చిత్రబృందంలోని పలువురు కీలక సభ్యులు ఇందులో కనిపించారు. మహిష్మతి సామ్రాజ్య నిర్మాణం వెనుక ఉన్న దూరదృష్టి, సాంకేతిక సవాళ్లు, చిత్ర నిర్మాణ ప్రయాణాన్ని ఈ ధారావాహిక హృద్యంగా ఆవిష్కరించింది.
ప్రభాస్‌తో పాటు వందలాది మంది సాంకేతిక నిపుణులు, సాహస విన్యాస కళాకారులు, కళా విభాగ సభ్యులు చేసిన కృషిని ప్రత్యేకంగా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి కోసం ప్రభాస్ చేసిన అంకితభావాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. డాక్యుమెంటరీ చివర్లో రాజమౌళి ఈ కథ ఇంకా ముగియలేదని సంకేతమివ్వగా, ప్రభాస్, రానా, అనుష్క కలిసి ‘బాహుబలి 3’ అధికారికంగా రానున్నట్లు ప్రకటించారు. అనంతరం తెరపై ప్రదర్శించిన "ది లెగసీ కంటిన్యూస్" అనే సందేశంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జక్కన్న తన తదుపరి చిత్రం పూర్తయ్యాక మరోసారి మహిష్మతి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!