

పొగాకు ధరల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలవడానికి వచ్చే వారం నుంచి పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో రైతులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. అనంతరం కూడా స్పందన లేకపోతే కొద్దిరోజుల్లో కందుకూరులో మరో పర్యటన చేపడతానని చెప్పారు. పొగాకు రైతులకు మద్దతుగా జిల్లాల వారీగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏ పంట రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా వైఎస్సార్‌సీపీ వారికి అండగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా మొత్తం పంటలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటివరకు కేవలం 38 మిలియన్ కిలోల కొనుగోళ్లు మాత్రమే జరిగాయని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!