

కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రూ.27 కోట్ల వ్యయంతో స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 15 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో నిత్యం 60 రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణలో వికారాబాద్‌తో పాటు తాండూరు, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి తదితర 42 రైల్వే స్టేషన్లను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో ప్రస్తుతం సుమారు రూ.80 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులతో పాటు రైల్వే మార్గాల విద్యుద్దీకరణ పూర్తయిందన్నారు. రైల్వే ప్రమాదాల నివారణకు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కవచ్, కవచ్ 2.0ను తెలంగాణలో అమలు చేస్తున్నామని, హైదరాబాద్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణేలకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో రైల్వేతో పాటు జాతీయ రహదారి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!