

అమరవీరుల స్మారక స్థలాల వద్ద గౌరవప్రదమైన వాతావరణాన్ని పాటించాల్సిందేనని అమెరికా సైన్యం మరోసారి స్పష్టం చేసింది. వెటరన్స్ డే సందర్భంగా అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో జరిగిన కార్యక్రమంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు అక్కడి గార్డ్ నుంచి హెచ్చరిక ఎదురైంది. హెగ్సెత్ తన భార్య జెన్నిఫర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్యాట్రిక్ వీవర్‌తో కలిసి గుర్తుతెలియని సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగిన తర్వాత వారు పరస్పరం మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వినట్లు సమాచారం. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికుడు వెంటనే స్పందించి, సందర్శకులంతా నిశ్శబ్దాన్ని, గౌరవప్రదమైన వాతావరణాన్ని పాటించాలని గట్టిగా హెచ్చరించాడు.
ఈ ఘటనపై పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందిస్తూ, పవిత్రమైన ఆ సందర్భంలో స్మారక స్థల గౌరవాన్ని కాపాడేందుకు సైనికుడు సరైన రీతిలో, బాధ్యతాయుతంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతో పాటు కొరియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తుతెలియని అమెరికా సైనికుల జ్ఞాపకార్థం ఈ సమాధిని నిర్మించారు. అమెరికాలో అత్యంత పవిత్రమైన యుద్ధ స్మారకాల్లో ఒకటిగా దీనిని భావిస్తారు. 1948 నుంచి అమెరికా సైన్యంలోని 3వ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన ‘ది ఓల్డ్ గార్డ్’ సైనికులు ఇక్కడ నిరంతరం పహారా కాస్తున్నారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ స్మారకాన్ని సందర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!