

నటి ఊర్వశీ రౌతేలాకు, లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఓ ఏఐ సంస్థకు మధ్య వివాదం నెలకొంది. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ ఊర్వశీ టీమ్ ఆ సంస్థ నుంచి రూ.7 వేల కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లు ఆమె టీమ్ వెల్లడించింది.
తాజాగా ఏఐ సంస్థ సీఈఓ షీరాజ్ హసన్ ఈ వివాదంపై స్పందించారు. బాలీవుడ్‌పై ఏఐ ప్రభావం గురించి ఊర్వశీ మాట్లాడిన పాత వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చెప్పని మాటలను తమ సంస్థ ఆమెకు ఆపాదించడం లేదని తెలిపారు. వినోద రంగంలో ఏఐ భవిష్యత్తులో భారీ మార్పులు తీసుకురానుందని, డిజిటల్ టెక్నాలజీ ద్వారా మరణించిన నటీనటుల ప్రదర్శనలను పునఃసృష్టించడం నుంచి ఒకే నటుడు పలు భాషల్లో మాట్లాడేలా చేయడం వరకు అనేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు, అనుమతి లేకుండా ఊర్వశీ పేరు, ఫొటోలు, ఇతర కంటెంట్‌ను ఉపయోగించవద్దని ఆమె టీమ్ ఏఐ సంస్థను హెచ్చరించింది. సొంత బ్రాండ్‌ను నిర్మించుకోవాలని, తమ వ్యాపారంలోకి ఊర్వశీ పేరును అనుమతి లేకుండా తీసుకురావద్దని స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!