

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా కుదిరిన కీలక పెట్టుబడి ఒప్పందం అమలు దిశగా మరో ముందడుగు పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలిసి ఈ ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. దావోస్ పర్యటన సందర్భంగా సీఎం ఇచ్చిన ఆహ్వానానికి స్పందిస్తూ యూఏఈ ఈ ప్రాజెక్టుకు ముందుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యూఏఈ భాగస్వామ్యంతో ఆహార శుద్ధి రంగంలో సమగ్ర వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యాన పంటల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (EDB) ఉన్నతాధికారులు, యూఏఈ ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!