

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చెందిన బాబీ చాంద్ (57), రశ్‌పాల్ కుమార్ (45) నవంబర్ 11న విధుల్లో ఉండగా అదృశ్యమయ్యారు. తమ క్యాంప్ నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్టుకు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దచన్ అటవీ ప్రాంతం నుంచి అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అటువైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. అదే సమయంలో ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా పనిచేయలేదని సమాచారం.
ఇద్దరు అధికారులు కనిపించకపోవడంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. గురువారం ఉదయం వారి మృతదేహాలను గుర్తించగా, శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో వారి సర్వీసు తుపాకులు కనిపించకపోవడంతో ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, బుధవారం కుల్గామ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!