

ఇటీవల నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో అన్నప్రసాదం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర విభాగాలపై 95 శాతానికి పైగా సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున గత ఉత్సవాల కంటే సుమారు 20 శాతం అదనపు రాకను అంచనా వేసి అన్నప్రసాదం, సామగ్రి, కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, ఇతర ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నట్లు చెప్పారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అవసరాన్ని బట్టి ప్రత్యేక దర్శనాలను నియంత్రించి వేచి ఉండే సమయాన్ని తగ్గించే విధానాన్ని కొనసాగిస్తామని అదనపు ఈవో తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడంతో పాటు ఊరేగింపులు, వాహనసేవలను క్రమబద్ధీకరించనున్నారు. అక్టోబర్‌లో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాదనీరాజనం ఏర్పాట్లను కూడా సమీక్షించారు. భక్తులు టీటీడీ అధికారిక వేదికల్లో విడుదల చేసే సమాచారాన్ని అనుసరించి తమ దర్శన, ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!